tirupati-dharmavaram | రైల్వేశాఖకు..ప్రయాణికుల మొర
tirupati-dharmavaram | రైల్వేశాఖకు..ప్రయాణికుల మొర
tirupati-dharmavaram | తిరుపతి–ధర్మవరం రూట్‌లో రెగ్యులర్ రైళ్లు నడపాలని విజ్ఞప్తి
శ్రీ సత్య సాయి బ్యూరో ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతానికి కీలకమైన తిరుపతి–పాకాల–ధర్మవరం రైల్వే మార్గంలో సరిపడా రైలు సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ మార్గం నేడు నిర్లక్ష్యానికి గురవుతుండడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి–గుంతకల్లు లైన్ పరిధిలో ఐదుగురు పార్లమెంటు సభ్యులు, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఒకే ఒక రెగ్యులర్ సర్వీస్‌తో..
ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఒక రెగ్యులర్ సర్వీస్ ఉండగా, ఒక లోకల్ ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా రైళ్లు ఎక్కువగా వీక్లీ స్పెషల్‌లుగా నడుస్తున్నాయి. దీంతో రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి నుంచి పాకాల, కదిరి, ధర్మవరం మీదుగా హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాలకు నేరుగా రెగ్యులర్ రైళ్లు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు దిశగా కొత్త రైళ్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, వాటిలో కనీసం కొన్ని సర్వీసులను ధర్మవరం–కదిరి–పాకాల మార్గంలో మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ప్రాంతీయ ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పాకాల–ధర్మవరం రైల్వే లైన్‌కు గొప్ప చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలనలో 1891లో మీటర్ గేజ్‌గా ప్రారంభమైన ఈ మార్గం, అప్పట్లో రాయలసీమలో వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను రవాణా చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడింది. ధర్మవరం జంక్షన్, కదిరి, మెలకలచెరువు, మదనపల్లె రోడ్, పీలేరు, కలికిరి, పాకాల జంక్షన్ వంటి ముఖ్య స్టేషన్లను కలుపుతూ ఈ మార్గం అభివృద్ధి చెందింది.
పనుల ఆలస్యంతో..
తరువాత కాలంలో ఈ లైన్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు 1997–98లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ పనులు దీర్ఘకాలం ఆలస్యం కావడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు 2010 జూన్ 30 నాటికి గేజ్ మార్పు పూర్తై, 2011లో రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ మార్పుతో పెద్ద రైళ్లు నడవడం, వేగం పెరగడం, కనెక్టివిటీ మెరుగుపడడం జరిగింది. అలాగే ఆధునీకరణలో భాగంగా 2017–18లో ప్రారంభమైన విద్యుదీకరణ పనులు 2022 నాటికి పూర్తయ్యాయి. మొత్తం 228 కిలోమీటర్ల ఈ మార్గం పూర్తిగా ఎలక్ట్రిక్ లైన్‌గా మారింది. దీంతో డీజిల్ నుంచి ఎలక్ట్రిక్‌కు మార్పు జరిగి సమయపాలన, వేగం మెరుగుపడ్డాయి.
సర్వీసులు ప్రారంభిస్తే “హై డిమాండ్ కారిడార్”గా..
ప్రస్తుతం ఈ మార్గంలో సికింద్రాబాద్–తిరుపతి, అమరావతి–తిరుపతి, సెవెన్ హిల్స్ వంటి రైళ్లు వీక్లీ స్పెషల్‌లుగా నడుస్తున్నాయి. కదిరి–తిరుపతి రెగ్యులర్ సర్వీస్, గుంతకల్లు–తిరుపతి ప్యాసింజర్ రైలు మాత్రమే సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ముంబై –నాగర్‌కోయిల్, కాచిగూడ–మదురై వంటి రైళ్లు కూడా ఈ మార్గాన్ని తాకుతున్నప్పటికీ అవి వారానికి ఒక్కసారే నడుస్తున్నాయి.
ముఖ్యంగా ఈ లైన్ ఇప్పటికీ సింగిల్ ట్రాక్‌గా ఉండటం పెద్ద లోపంగా భావిస్తున్నారు. రైళ్ల సంఖ్య పెంచాలంటే డబ్లింగ్ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ధర్మవరం–తిరుపతి మధ్య మెమూ లోకల్ ట్రైన్ సేవలు ఉన్నప్పటికీ అవి సరిపోవడం లేదు. హైదరాబాద్–ధర్మవరం–కదిరి–పాకాల–చెన్నై, హైదరాబాద్–తిరుపతి, అలాగే ముంబై–పుణే కనెక్టివిటీ పెంపు వంటి అనేక మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే ఈ మార్గం “హై డిమాండ్ కారిడార్”గా మారే అవకాశం ఉంది. రాయలసీమలో తిరుపతి కనెక్టివిటీకి ఇది అత్యంత కీలక మార్గం కావడంతో దీనిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని..
1891లో చిన్న మీటర్ గేజ్ లైన్‌గా ప్రారంభమైన ఈ మార్గం, 2010లో బ్రాడ్ గేజ్‌తో కొత్త జీవం పొందింది. 2022లో ఎలక్ట్రిఫికేషన్‌తో ఆధునిక దశలోకి అడుగుపెట్టింది. అయితే ఇంకా డబ్లింగ్, కొత్త రైళ్లు ప్రవేశపెడితే ఇది రాయలసీమకు “గోల్డెన్ కారిడార్”గా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట, హిందూపురం, అనంతపురం పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకుంటే ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
