june12th | నిరీక్ష‌ణ‌కు తెర‌ కొత్త పింఛన్ల మంజూరు

june12th | నిరీక్ష‌ణ‌కు తెర‌ కొత్త పింఛన్ల మంజూరు

june12th | పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ముందుగా వితంతువులకే ప్రాధాన్యం

ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : సంవ‌త్స‌రాల త‌రబ‌డి పింఛ‌న్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్‌ 12 నాటికి రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఇందువ‌ల్ల ప‌ల్నాడు జిల్లాలో ముందుగా వితంతులకు పింఛ‌న్ అంద‌నుంది.

పింఛ‌న్ల కోసం ప‌డిగాపులు

జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు.. ప్రభుత్వం మంజూరు చేసే సామాజిక పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మళ్లీ రావాలని సచివాలయ ఉద్యోగులు చెబుతుండడంతో అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలు కొత్త పింఛన్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌తో 2024 ఏప్రిల్‌ 18 నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీనివల్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం సచివాలయాలు, కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని అర్హులు ఆవేదన చెందారు.

పల్నాడు జిల్లాలో 2410 దరఖాస్తులు పెండింగ్‌

పల్నాడు జిల్లాలో దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి 2410 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి వారం కనీసం 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయని అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మంజూరుచేసిన పెన్షన్లలో ఈ జిల్లాలో సుమారు 3 వేల వరకు అనర్హులున్నట్లు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీచేశారు. వారందరికీ ‘సదరం’ ధ్రువీకరణ జరుగుతోంది. మ‌రోవైపు వితంతు, ఇత‌ర పింఛ‌న్ల అర్హుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూ పోతుంది. 2015 ఏప్రిల్‌ 18న జీవో నెం. 39 ద్వారా ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు మంజూరుచేశారు. అదే ఏడాది కొత్త పెన్షన్లు మరో 1.50 లక్షలు మంజూరుచేస్తూ జీవో 66 ఇచ్చారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు, అంటే 2018 డిసెంబరు నుంచి పెన్షన్ల మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచుతూ 2019 జనవరి 25న జీవో 13ను విడుదల చేశారు. దాని ప్రకారం రూ.1000 పొందుతున్న పెన్షన్‌దారులు రూ.2 వేలు, రూ.1500 పొందుతున్న దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచారు.

మిగిలిన పింఛ‌న్ల ప‌రిస్థితి ఏమిటీ..?

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పింఛన్లు కలిపి ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి నెలా పింఛన్లు ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ‘ఎన్టీఆర్‌ భరోసా’ పెన్షన్ల పంపిణీ విషయంలో శ్రద్ధ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు, దివ్యాంగులకు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేలకు పెన్షన్లు పెంచారు. ఠంచనుగా ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారు ఇంటి గుమ్మంలోకి వెళ్లి పింఛను డబ్బులు చేతికి అందిస్తున్నారు. అయితే, కొత్త దరఖాస్తులకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఓసీలకు 60 ఏళ్లకు పెన్షన్లు ఇస్తామన్న హామీతో పాటు ఎస్సీ, ఎస్టీలు, కొన్ని బీసీ కులాలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్న హామీతో పెన్షన్‌ దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశాలు రాకపోవడంతో వచ్చిన దరఖాస్తుదారులకు సమాధానాలు చెప్పలేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా అర్హుల నుంచి దరఖాస్తులు గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుతున్నాయి. జిల్లాలోనూ ఇదే విధ‌మైన ప‌రిస్థితి నెల‌కొంది.

ముందుగా వితంతువుల‌కే..

కేటగిరీ కింద.. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్‌ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరుచేస్తోంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛనును మరుసటి నెలలోనే (మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన వెంటనే) భార్య పేరు మీదకు బదలాయిస్తోంది. దీనికి స్పౌజ్‌ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటివరకు పింఛను ఆసరా కోల్పోకుండా చేయూత ఇస్తోంది. పింఛను అందని భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛను రావడం లేదు. తమకూ పింఛను ఇవ్వాలని వారినుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉంది. దీంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించ‌టం ప‌ట్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో హ‌ర్షం వ్యక్తం అవుతుంది. అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పింఛను తీసుకుంటున్న ఆరున్నర లక్షల మందిలోనూ లక్షకు పైగా అనర్హులున్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది.

సామాజిక భద్రతే ధ్యేయంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కొత్త పింఛన్ల మంజూరు విషయంలో వితంతువులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం సాహసోపేతమైన, మానవీయమైన చర్య. ఏళ్ల తరబడి సచివాలయాల చుట్టూ తిరుగుతున్న అర్హులకు, వెబ్‌సైట్ సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆవేదన చెందుతున్న పేదలకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలవనుంది.

Leave a Reply