పాఠశాలకు దారేది?.. వార్తతో కదిలిన అధికార యంత్రాంగం

రెంకొని వాగు తాత్కాలిక వంతెనను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల..

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక ఆదేశాలు

ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిన్న ఆంధ్రప్రభ వెబ్‌లో ప్రచురితమైన “పాఠశాలకు దారేది?” కథనం ప్రభావంతో అధికార యంత్రాంగం స్పందించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా వరద ఉద్ధృతికి తెగిపోయిన రెంకొని వాగు తాత్కాలిక వంతెనను పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.

వాగుకు అవతల ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ (టీఎంఆర్‌ఈఐఎస్) విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచించారు. అలాగే వరద ప్రవాహం ఉన్న వాగులు, చెరువుల్లోకి వెళ్లడం, ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఖానాపూర్ సీఐ కటకం సత్యనారాయణ, ఎస్‌ఐ రాహుల్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, న్యాయవాది షబ్బీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.