ఐపీ పెట్టి డబ్బులు ఎగ్గొట్టడానికి ఇందనపల్లి వాసి పన్నాగం..

23 మందికి కోర్టు నోటీసులు..
రూ.36లక్షల30 వేలకు ఐపీ..
గగ్గోలు పెడుతున్న బాధితులు..

జన్నారం, ఆంధ్రప్రభ : డబ్బులు ఎగ్గొట్టడానికి ఓ వ్యక్తి 23 మందికి రూ.36 లక్షల 30 వేలకు ఐపీ నోటీసులు పంపించిన ఉదంతమిది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లికి చెందిన మెరుగు ఐలయ్య ప్రస్తుతం హైదరాబాదులో ఉంటూ, గత కొంత కాలంగా చేసిన అప్పులను ఎలాగైనా ఎగ్గొట్టాలని దురుద్దేశంతో అదే గ్రామానికి,ఇతర గ్రామాలకు చెందిన 23 మంది బాధితులకు రూ. 36లక్షల30వేలకు మంచిర్యాల కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.

ఈ మేరకు నోటీసులు అందుకున్న ఆ బాధితులందరూ ఆందోళనకు గురై,లబోదిబోమంటూ గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలోని చింతల అశోక్ కు రూ.10లక్షలు, ఇందనపెల్లికి చెందిన ఎస్.ఐలయ్యకు రూ.3లక్షలు, సత్తన్న, అంజయ్య, లచ్చన్నలకు రూ.2 లక్షల చొప్పున, జె. సత్తన్న, హన్మాండ్లుకు రూ.1.5 లక్షల చొప్పున, తిరుపతికి రూ.1.3 లక్షలు, అశోక్ రావుకు, మల్లేష్, అంజేష్, విజయలక్ష్మి, మల్లయ్యకు, నరేందర్ కు, శ్రీధర్ కు, పోషన్నకు రూ.1 లక్ష చొప్పున, మరి కొంతమందికి రూ.1 లక్ష నుంచి రూ.50వేల వరకు ఇలా మొత్తం 23 మందికి రూ.36 లక్షల 30 వేలు బాకీ ఉన్నానని ఐలయ్య కోర్టు నోటీసులు పంపించారు.

ఈ మేరకు కోర్టు నోటీసులు అందుకున్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఐలయ్యకు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే రూ.1.5 కోట్ల విలువచేసే భూమి ఉందని సమాచారం. ఆ బాధితులంతా చట్ట పరిధిలో డబ్బులు రాబట్టుకోవడానికి ఓ సీనియర్ లాయర్ ను పెట్టుకుని వాదించుకోవడానికి సమయతమవుతున్నామని కొంతమంది బాధితులు బుధవారం సాయంత్రం ఆంధ్రప్రభతో వాపోయారు.