El-nino-Fodder-Crisis : ప‌శుగ్రాసం సంక్షోభం Andhra Praba Top Story

El-nino-Fodder-Crisis : ప‌శుగ్రాసం సంక్షోభం Andhra Praba Top Story

  • గ్రీన‌రీ మాయం
  • మూగ‌జీవుల ఆక‌లి కేక‌లు
  • ఊరూరా మేత క‌ర‌వు
  • ఇదీ ఎల్‌నినో ఎఫెక్ట్
  • ముందస్తు చర్యల్లో పశుసంవర్థక శాఖ

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చెరువులు, కుంటలు, కాలువలు ఎండిపోయి నీటి వనరులు క్షీణించాయి. సాగునీటి కొరత కారణంగా రైతులు పంటల సాగును గణనీయంగా తగ్గించాల్సి వచ్చింది. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వేరుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోవడంతో వ్యవసాయ క్షేత్రాల్లో పచ్చదనం పూర్తిగా కనుమరుగైంది. పంట అవశేషాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పశువులకు అవసరమైన పశుగ్రాసం తీవ్రంగా కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఆవులు, గేదెలతో పాటు గొర్రెలు, మేకలకు మేత దొరకక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా పశుసంవర్థక శాఖ 2026 27 పశుగ్రాసం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. పశుగ్రాస కొరతను అధిగమించేందుకు సమగ్ర ప్రత్యామ్నాయ కార్యాచరణకు రూపకల్పన చేసింది. చిత్తూరు జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, మండలం వారీగా పశువుల సంఖ్య, పశుగ్రాస అవసరం, అందుబాటులో ఉన్న మేత, లోటు మిగులు పరిస్థితులను అధికారులు శాస్త్రీయంగా అంచనా వేశారు.

El-nino-Fodder-Crisis : 2.32 ల‌క్ష‌ల ట‌న్నుల గ‌డ్డి అవ‌స‌రం.

చిత్తూరు జిల్లాలో మొత్తం 5.05 లక్షల పశువులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు 2.32 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరమవుతుందని అంచనా వేయగా, వివిధ వనరుల ద్వారా సుమారు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం సమీకరించే అవకాశముందని నివేదికలో పేర్కొన్నారు. అయితే జిల్లా మొత్తంగా మిగులు కనిపించినప్పటికీ అన్ని మండలాల్లో పరిస్థితి ఒకేలా లేదని అధికారులు స్పష్టం చేశారు. బంగారుపాళ్యం, గంగవరం, గుడిపల్లి, నగరి, నిండ్ర, పులిచెర్ల, రొంపిచెర్ల, తదితర మండలాల్లో పశుగ్రాస లోటు ఉండగా, కుప్పం, బైరెడ్డిపల్లి, చిత్తూరు రూరల్, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, యాదమరి వంటి మండలాల్లో మిగులు పశుగ్రాసం అందుబాటులో ఉంటుందని గుర్తించారు. అవసరమైతే మిగులు మండలాల నుంచి లోటు ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తరలించే ఏర్పాట్లు చేయనున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా రైతులకు నాణ్యమైన పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించారు. స్వల్పకాలిక పశుగ్రాస పంటలైన జొన్న, మొక్కజొన్న, నాపియర్ గడ్డి, మల్టీకట్ పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించనున్నారు. గ్రామాల వారీగా పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో రైతులకు పశుగ్రాసం అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. పంట అవశేషాలను వృథా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో సైలేజ్ తయారు చేసి నిల్వ చేయడం, పశుగ్రాసాన్ని చిన్న ముక్కలుగా కోసి వినియోగించేందుకు చాఫ్ కట్టర్లు పంపిణీ చేయడం, అవసరమైన ప్రాంతాలకు పశుగ్రాస రవాణా, పశుదాణా సరఫరా వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయనున్నారు.

El-nino-Fodder-Crisis : ముంద‌స్తు చ‌ర్య‌ల్లో.. అధికారులు

కరవు నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే వందల మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, పశుదాణా రైతులకు పంపిణీ చేశారు. వందలాది చాఫ్ కట్టర్లను అందజేయడంతో పాటు వేలాది ఎకరాల్లో పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నారు. అలాగే వేల సంఖ్యలో మినీ గోకులాలు ఏర్పాటు చేసి పశువులకు మేత, తాగునీటి సౌకర్యాలు కల్పించే చర్యలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కరవు పరిస్థితులు మరింత తీవ్రం అయితే ప్రత్యేక పశువుల శిబిరాలు ఏర్పాటు చేసి పాల ఉత్పత్తి చేసే పశువులకు ప్రాధాన్యంగా పశుగ్రాసం అందించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి మండలంలో వరి, జొన్న, రాగి, వేరుశనగ, చెరకు, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంట అవశేషాలు, గ్రీన్ మ్యాన్యూర్ పంటలు, వార్షిక, శాశ్వత పశుగ్రాస పంటల ద్వారా లభించే మేతను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు, బంజరు భూములు, చెరువుల కట్టలు, పశువుల మేత భూముల్లో ప్రత్యేక పశుగ్రాస పంటల సాగు చేపట్టాలని సూచించారు. రైతులకు పశుగ్రాస సంరక్షణ, సైలేజ్ తయారీ, మేత నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో వర్షాభావం కొనసాగుతున్న నేపథ్యంలో పశుసంపదను కాపాడటం అత్యంత కీలకంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. పశువులకు మేత కొరత కారణంగా రైతులు తమ పశువులను తక్కువ ధరలకు విక్రయించే పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్రతి పశుగ్రాస వనరును సమర్థవంతంగా వినియోగించడం, లోటు ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయడం, పశువులకు తాగునీరు, దాణా, మేత నిరంతరంగా అందించడం ద్వారా కరవు ప్రభావాన్ని తగ్గించాలని జిల్లా పశుసంవర్థక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యాచరణను సంబంధిత శాఖల సమన్వయంతో అమలు చేసి జిల్లాలో పశుగ్రాస సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరి స్పష్టం చేశారు.