మెరుగైన వైద్యం కోసం ఐదుగురికి ఆర్థిక భరోసా
మెరుగైన వైద్యం కోసం ఐదుగురికి ఆర్థిక భరోసా
రూ.18.57 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలు అందజేత
భవానిపురం, ఆంధ్రప్రభ: మెరుగైన వైద్యం కోసం ఐదుగురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.18.57 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలను మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్‌కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
48వ డివిజన్ వాగు సెంటర్‌కు చెందిన ఈ. సింహాచలం హృద్రోగంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఎల్‌ఓసీ కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.5 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి సహాయం అందించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా 48వ డివిజన్ చిట్టినగర్‌కు చెందిన బెవర అప్పల నరసమ్మ గర్భాశయ సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.4 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు. చిట్టినగర్‌కే చెందిన ఆనంద్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.2.52 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.
46వ డివిజన్ సిండికేట్ బ్యాంక్ కాలనీకి చెందిన కొమ్మోజు వరలక్ష్మి గర్భాశయ సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.3.98 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు. అలాగే 38వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్‌కు చెందిన పి. జరీనా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.3.07 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వేవిన నాగరాజు, దేవిన హరిప్రసాద్, ఏలూరు సాయి శరత్, దుక్కా దుర్గారావు, జి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
