నేటి యువత సమస్యలపై చైతన్యంతో ముందుకు రావాలి..

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ, ఆంధ్రప్రభ : నేటి యువతరం సమస్యలపై చైతన్యం కలిగి ఉండడం శుభపరిణామం అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గ్రామాల అభివృద్ధిలో కూడా విద్యార్థులు ఇదే చైతన్యంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

నందివాడ మండలం ఇలపర్రు నుండి గుడివాడకు వచ్చే ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణం స్పందించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు శనివారం ఉదయం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు.

ఇలపర్రు టు గుడివాడ రూటులో ఉదయం వేళ ఒకే సర్వీస్ ఉండటంతో బస్సులో నిలబడేందుకు కూడా స్థలం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని స్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో కాలేజీలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని వాపోయారు. గతంలో డిపో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

విద్యార్థుల సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము వెంటనే ఆర్టీసీ ఆర్ఎం తో ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇలపర్రు రూటులో స్టూడెంట్స్ స్పెషల్ సర్వీస్ నడపాలని, లేదా ఉదయం, సాయంత్రం రెండు సర్వీసులు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విద్యార్థులతో మాట్లాడుతూ “రద్దీగా ఉన్న ఆ బస్సులో ప్రయాణించేది కూడా మీ కుటుంబ సభ్యులే అనే విషయాన్ని గుర్తించాలన్నారు.మీరు లేవనెత్తిన సమస్యను వారం రోజుల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

ఇంత చైతన్యవంతంగా సమస్యపై స్పందించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ చైతన్యం కేవలం బస్సు సమస్యకే కాదు… గ్రామంలో పరిశుభ్రత, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా ఉండాలన్నారు. గ్రామస్తులకు కూడా మీరు అవగాహన కల్పించాలి” అని సూచించారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను గానీ, అధికారులను గానీ సంప్రదించి పరిష్కరించుకోవాలని, బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే రాము విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే రాముకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యపై తక్షణం స్పందించిన ఎమ్మెల్యే చర్యలపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, దానేటి సన్యాసిరావు, మాజీ సర్పంచ్ లు మసిముక్కు వేణుగోపాల్, సింగాల రాధాకృష్ణ వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.