వాడకట్టు ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం..

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో ఆదివారం నిర్వహించిన వాడకట్టు ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం మహిళల్లో ఆనందోత్సాహాలను నింపింది. వివాహాల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్లిన మహిళలు, ఆడబిడ్డలు ఎన్నో ఏళ్ల తర్వాత ఒకేచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది వాడకట్టు మహిళలు పాల్గొని పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి స్నేహాలు, ఆటలు, పాటలు, ఊరి విశేషాలు, కుటుంబ అనుబంధాలు, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

విదేశాలు, ఇతర రాష్ట్రాలు, పక్క జిల్లాల్లో నివసిస్తున్న పలువురు మహిళలు కూడా ప్రత్యేకంగా హాజరై కార్యక్రమానికి మరింత వైభవం తీసుకువచ్చారు. బంధువులు, స్నేహితులు, పక్కింటి వారంతా ఒకేచోట కలుసుకోవడంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది.

ఆధునిక జీవనశైలిలోనూ కుటుంబ బంధాలు, సంప్రదాయ విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పాల్గొన్న మహిళలు అభిప్రాయపడ్డారు. చిన్నారులు తమ అమ్మమ్మలు, అత్తలు, పిన్నిలతో కలిసి సందడి చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సమ్మేళనం ద్వారా వాడకట్టు మహిళల మధ్య ఐక్యత, అనుబంధం మరింత బలపడిందని పాల్గొన్న వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని తాడిచెట్టు సుజాత, భూలక్ష్మి రామ్, భూలక్ష్మి, గోదావరి తదితరులు సమన్వయం చేసి విజయవంతం చేశారు.

Leave a Reply