భర్త అదృశ్యం.. భార్య ఫిర్యాదు

జన్నారం, ఆంధ్రప్రభ : భర్త ఆచూకీ తెలియక పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రానికి చెందిన 50 ఏళ్ల గూడ మల్లేష్ అదృశ్యమైనట్లు భార్య గూడ సుజాత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.
శనివారం సాయంత్రం ఆయన వివరాల ప్రకారం, జన్నారం మండలం తిమ్మాపూర్ రామాలయం వెనుక ఈ నెల 17న రాత్రి గూడ మల్లేష్ మరికొంతమందితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ సమయంలో చీకటిలో ఎవరో టార్చ్ లైట్ వేయడంతో పోలీసులు వచ్చారనే భయంతో అక్కడి నుంచి అందరూ పరుగులు తీశారని భార్య ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నుంచి గూడ మల్లేష్ కనిపించడంలేదని, ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని, ఎక్కడ వెతికినా జాడ తెలియలేదని ఆమె తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు. గూడ మల్లేష్ ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
