జన్నారంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జన్నారం (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా అక్కపల్లిగూడ మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, ప్రతి తరగతి గదిని పరిశీలిస్తూ విద్యార్థుల హాజరు, విద్యా సామర్థ్యం, మధ్యాహ్న భోజన వంటగది నిర్వహణను తనిఖీ చేశారు.
అనంతరం పొనకల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కిష్టాపూర్ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), జన్నారం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బానావత్ రాజేందర్, తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ ఎం. శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
