అభివృద్ధి పనులపై ప్రజల అసంతృప్తి..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ నిధులతో రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 65 అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రారంభించిన ఈ పనులు ఇప్పటికీ శిలాఫలకాలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు.
2025 అక్టోబర్ 25న ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.701 ద్వారా మున్సిపాలిటీలో 65 పనులకు అనుమతి లభించింది. ఈ క్రమంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, నాలుగున్నర నెలలు గడిచినా పనులు ముందుకు సాగలేదు.
యూఐడీఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలు గత నాలుగు నెలలుగా సీడీఎంఏ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ప్రారంభించిన పనులు నిలిచిపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కాంటా చౌరస్తా నుంచి కన్నాల ఫ్లైఓవర్ వరకు రోడ్డు విస్తరణ, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4.50 కోట్లు, గాంధీ చౌక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు మురికి కాలువ నిర్మాణానికి రూ.5 కోట్లు, మిగతా పనులకు రూ.9.20 కోట్లు కేటాయించినప్పటికీ, పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు నెలలుగా ఒక్క పని కూడా ప్రారంభం కాకపోవడంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి అవుతాయని ఆశించిన మున్సిపల్ కౌన్సిలర్లు కూడా నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉండగా, చిన్న పనులను పక్కనపెట్టి పెద్ద మొత్తంలో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారనే గుసగుసలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ శాఖ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగానే పనులు ఆలస్యమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విడుదలలో జాప్యం కూడా ప్రధాన కారణమని ప్రజలు అంటున్నారు.
ఇప్పటికైనా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, ఇంజనీరింగ్ అధికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న ఫైల్ క్లియరెన్స్ సాధించి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
