POLICE | రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు గాయాలు

POLICE | రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు గాయాలు
- పరిస్థితి విషమం..
- బెంగళూరు ఆసుపత్రికి తరలింపు
POLICE | వి.కోట, ఆంధ్రప్రభ : పలమనేరు నియోజకవర్గం వి. కోట మండల కేంద్రంలోని సాయిగార్డెన్‌లో నివాసం ఉంటున్న మునే గౌడ అనే హోమ్ గార్డ్ ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. పెద్దపంజాణి స్టేషన్‌లో మునే గౌడ్ హోమ్‌గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం నాలుగున్నర గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళుతుండగా ఎగువ బస్టాండ్‌లోని వైయస్సార్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయాలతో పాటు తీవ్ర రక్తస్రావం అయ్యింది. 108 అంబులెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు అతన్ని కుప్పం పి.ఈయస్ వైద్య కళాశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల అతన్ని బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉండటంతో ఎదురుగా వస్తున్న టెంపో అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నట్లు తెలిసింది. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు పోలీసులు వైయస్సార్ సర్కిల్ లోని సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సీఐ సోమశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
