AP |కుప్పం ఆదరణ మరువలేను…
- భువనేశ్వరి భావోద్వేగ వ్యాఖ్యలు
కుప్పం అభివృద్ధే లక్ష్యం - ఎకో టూరిజంతో ఉపాధి
- కుప్పానికి పర్యాటక కళ
AP |కుప్పం, ఆంధ్రప్రభ : నిజం గెలవాలి యాత్ర సమయంలో కుప్పం ప్రజలు నాపై చూపించిన ఆదరణను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ప్రజల బాగోగులు తెలుసుకోవడం, వారి సమస్యలను వినడం కోసం బాధ్యత కలిగిన కార్యకర్తగా నేను వచ్చాను అని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం రామకుప్పం మండలం నారాయణపురం తాండ, ననియాల తాండ మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని, కుప్పంలో ఎకో టూరిజం అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించడంతో పాటు పర్యాటక మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే రూ.3.5 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. స్థానికంగా 10 ఎకరాల్లో జింకల పార్కు, జంగిల్ హట్ రిసార్ట్, చిన్నారుల కోసం ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హంద్రీ-నీవా ద్వారా చంద్రబాబు కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చారని, ప్రస్తుతం 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. ఇప్పటికే 110 చెరువులు నింపామని, త్వరలో అన్ని చెరువులకూ కృష్ణా జలాలు చేరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ననియాల పంచాయతీ పరిధిలో రూ.20 లక్షలతో రహదారులు, రూ.40 లక్షలతో పంచాయతీ భవనం నిర్మించామని, రూ.32 లక్షలతో ఆస్పత్రిని ఆధునీకరించినట్లు వివరించారు. పీ4 కార్యక్రమం కింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.1 లక్ష చొప్పున 10 మందికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించామని చెప్పారు. తాండలో 153 మందికి పింఛన్లు అందుతుండగా, తల్లికి వందనం పథకం కింద 144 మందికి రూ.21 లక్షలు జమ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రామాపురం తాండ, విరియాల తాండ ప్రజలు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, గోకులం షెడ్లు మంజూరు చేయడం, రామాపురం తాండలో చెక్‌డ్యామ్ నిర్మించాలని భువనేశ్వరిని కోరారు. ప్రజల వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

అంతకుముందు శాంతిపురంలోని తన నివాసంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో స్థానిక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రామకుప్పం మండలం విజిలాపురం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి చదువు, మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని చాక్లెట్లు పంపిణీ చేశారు.
నారాయణపురం తాండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్.గొల్లపల్లి పంచాయతీ పరిధిలోని కావలి మడుగు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. పీ4 పథకం కింద విద్యార్థులకు సైకిళ్లు, క్రీడా పరికరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే పీ4 ద్వారా అందిన రూ.75 వేల సాయంతో ఓ మహిళ ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ప్రారంభించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
