అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు..
- ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు..
- రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడే అవకాశం ఉన్నందున, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రైతు బజార్లో రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కు, బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదాయంలో సుమారు 90 శాతం ఉద్యోగుల జీతాలకే వెచ్చించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కందిపప్పు, వంటనూనె, ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులను అవసరానికి అనుగుణంగా రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు ప్రభుత్వ చర్యలను అర్థం చేసుకుని సహకరించాలని, రైతు బజార్ల ద్వారా అందిస్తున్న ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.
