- FTLను ఏకపక్షంగా నిర్ణయించవద్దు
- తగిన ప్రక్రియ లేకుండా కూల్చివేతలు అన్యాయమని ధర్మాసనం.
హైదరాబాద్‌లోని సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్ల కూల్చివేతను ధర్మాసనం తీవ్రంగా ఖండించింది.
నిర్మాణాలు అక్రమమైనా, నిబంధనల ప్రకారం తొలగించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. నీళ్లు వస్తున్నాయని కూల్చివేస్తూ పోతే.. హైదరాబాద్‌లోని చాలా నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమవుతాయని పేర్కొంది. FTL ని ఏకపక్షంగా నిర్ణయించకూడదని కూడా సూచించింది.
నోటీసుల్లేకుండానే ఇళ్లను కూల్చివేతలు
సున్నం చెరువు సమీపంలోని ఇళ్ల కూల్చివేత బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో హైడ్రా తమ ఇళ్లను కూల్చివేసిందని, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, అధికారిక సర్వే లేకుండానే కూల్చివేసిందని వారు ఆరోపించారు. ఇళ్లు అకస్మాత్తుగా కూల్చివేయడంతో తాము నిరాశ్రయులయ్యామని వాపోయారు.
పిటిషనర్లు సమర్పించిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు, అవన్నీ చెల్లుబాటు అయ్యేవని వ్యాఖ్యానించింది. ఇంటిని కూల్చివేయడానికి ఒక స్పష్టమైన ప్రక్రియ ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. అధికారులు ఆ ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇకపై కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు హైడ్రాను ఆదేశించింది. అదనంగా, సున్నం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలలో చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు హైడ్రాను ఆదేశించింది. హైడ్రా నిబంధనలను పాటిస్తున్నదా లేదా అని పర్యవేక్షించడానికి కోర్టు తదుపరి విచారణను 17కు వాయిదా వేశారు.