ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా
పోలీస్ జాబ్స్ కోసం యువత గళం
19 వేల పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరుద్యోగ యువత హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో సోమవారం మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7,437 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19 వేల పోలీస్ పోస్టుల భర్తీకి మరో సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నోటిఫికేషన్ విడుదలలో జరిగిన జాప్యం కారణంగా వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటే వయోపరిమితిని పెంచాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీస్ నియామక నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే దరఖాస్తు రుసుము కూడా నిరుద్యోగులపై అదనపు భారం అవుతోందని, దానిని వెంటనే తగ్గించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరుద్యోగులు, తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో పారదర్శకతతో పాటు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు మధుసూదన్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, కరుణాకర్, శ్రీకాంత్ రాథోడ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

