గుడిమెట్లలో పునర్నిర్మిత దేవాలయాల దర్శనం

గుడిమెట్లలో పునర్నిర్మిత దేవాలయాల దర్శనం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దేవినేని ఉమా..
రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
నందిగామ – ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఇటీవల పునర్నిర్మాణం చేసిన పలు గ్రామదేవతల ఆలయాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం సందర్శించారు. ఆలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

గ్రామంలో పునర్నిర్మించిన పాతపాటి అంకమ్మతల్లి, నీలగిరి అంకమ్మతల్లి, కాటమరాజు స్వామి, గంగమ్మతల్లి దేవాలయాలను సందర్శించిన దేవినేని ఉమా, ఆలయాల అభివృద్ధికి కృషి చేసిన గ్రామస్తులు, దాతలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సంప్రదాయాలు, గ్రామదేవతల ఆరాధన ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు సంక్షేమం, సాగునీటి రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
స్వర్గీయ దేవినేని రమణ కృషితో ప్రారంభమైన ప్రతిష్టాత్మక వేదాద్రి ఎత్తిపోతల పథకం రైతాంగానికి ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పథకానికి సంబంధించిన మరమ్మతు పనులు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేతృత్వంలో ప్రారంభమయ్యాయని తెలిపారు.
రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాల్లోని పురాతన దేవాలయాల పునరుద్ధరణతో పాటు వాటి వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
గ్రామస్థులు ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
