ఇందిరమ్మ ఇంటి కోసం దాచిన రూ.80 వేల నగదు అగ్నికి ఆహుతి

పేద కుటుంబం ఆవేదన

ఆంధ్రప్రభ–హనుమకొండ ప్రతినిధి: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉంచిన నగదుతో పాటు గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎండి ఖాసీంది ఎన్నో ఏళ్లుగా తన కుమారుడు, కుమార్తెతో కలిసి రేకుల షెడ్డులో నివాసం ఉంటోంది. ఆమె పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.

ఇంటి నిర్మాణం కోసం మహిళా సంఘం ద్వారా రూ.50 వేలు, ఇతరుల వద్ద నుంచి మరో రూ.30 వేలు అప్పుగా తీసుకువచ్చి, మొత్తం రూ.80 వేల నగదును ఇంట్లో ఉంచింది. ఇదే సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ఇల్లు మంటల్లో చిక్కుకుంది. దీంతో ఇంట్లో ఉన్న నగదుతో పాటు గృహోపకరణాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.

అప్పుగా తెచ్చిన నగదు కాలి బూడిద కావడంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురైంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెను చూసి స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు.

కరెంటు షార్ట్‌సర్క్యూట్ కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.