విషాదం.. విద్యుత్ షాక్తో గోవు మృతి
అధికారుల నిర్లక్ష్యమే కారణం: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రభ, విజయవాడ: విజయవాడ నగరంలోని సీతన్నపేట స్విమ్మింగ్ పూల్ వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ షాక్కు గురై ఒక గోవు మృతి చెందింది. ఈ వార్త తెలియగానే సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన గోమాతకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అంజలి ఘటించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ నగర పాలక సంస్థ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం, తీవ్ర నిర్లక్ష్యమే ఈరోజు ఒక గోమాత ప్రాణం తీసిందని మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రమాదకరంగా వంగిపోయిన ట్రాన్స్ఫార్మర్తో పాటు పాత విద్యుత్ స్తంభాన్ని తక్షణమే తొలగించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీతన్నపేట స్విమ్మింగ్ పూల్ వద్దకు ప్రతిరోజూ వందలాది మంది చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు వస్తుంటారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో విద్యుత్ షాక్ ఘటన జరగడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. ఇది భావి ప్రమాదాలకు హెచ్చరిక సంకేతం అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరం నలుమూలలా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వెంటనే తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు అత్యవసరంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల, చిన్నారుల భద్రతను పూర్తిగా విస్మరించిన బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి వెంకన్న, పిల్ల దుర్గారావు, కృష్ణ గో సంరక్షకులు పాల్గొన్నారు
