ఒప్పందం సరే.. బకాయిల చెల్లింపులేవి..?

ఓటీఎస్‌ ఒప్పందం తర్వాత చెల్లింపుల జాప్యం తగదు

వెంటనే రూ.450 కోట్ల విడుదల చేయండి
8 శాతం రాయితీ ఇచ్చినా పెండింగ్‌లే మిగిలేయి
ఆరోగ్య సేవల వ్యవస్థపై ప్రభావం పడుతుంది
రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ విజ్ఞప్తి

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : రాష్ట్రంలో ఓటీఎస్‌ (వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌) ప్రక్రియ పూర్తయినా, ప్రభుత్వ బకాయిల విడుదలలో కొనసాగుతున్న జాప్యం ఇప్పుడు ప్రైవేట్‌ ఆస్పత్రులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్‌ (ఆశా) ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు 8 శాతం డిస్కౌంట్‌తో ప్రభుత్వానికి సహకరించిన ఆస్పత్రులు, మరోవైపు నెలల తరబడి చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడింది.

ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అధికారుల సహకారంతో ఓటీఎస్‌ ప్రక్రియ విజయవంతమైందని ఆశా అధ్యక్షుడు డా. కె. విజయ్‌కుమార్‌, కార్యదర్శి డా. సి. అవినాష్‌ తెలిపారు. అయితే ఒప్పందం కుదిరిన వెంటనే చెల్లింపులు క్రమబద్ధంగా జరగాల్సి ఉండగా, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన సుమారు రూ.420 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉండటాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఆస్పత్రులు ప్రభుత్వానికి తోడుంటే… ప్రభుత్వం కూడా ఆస్పత్రుల నిలకడకు అండగా ఉండాలి అంటూ ఆశా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే భారీ డిస్కౌంట్‌ ఇచ్చి ఆర్థికంగా తగ్గించుకున్న ఆస్పత్రులు, ఇప్పుడు పెండింగ్‌ బిల్లులతో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. చెల్లింపులు మరింత ఆలస్యమైతే ఓటీఎస్‌ ఒప్పందం అమలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో వైద్య సేవల నిధులు నిలిపివేస్తే, దాని ప్రభావం చివరకు సాధారణ రోగులపైనే పడుతుందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులు నిలకడగా నడవకపోతే ఆరోగ్య సేవల వ్యవస్థలో అంతరాయం తప్పదని స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సౌరవ్‌ గౌరవ్‌ ఐఏఎస్‌ కీలక పాత్ర పోషించారని ఆశా ప్రతినిధులు ప్రశంసించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.450 కోట్ల బకాయిలను మే 25లోపు విడుదల చేసి ఆస్పత్రులకుఊరట నివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రులు బలంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్య భద్రత” అన్న సందేశంతో ఆశా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.