శ్రీలంకకాలనీలోకి నీరు రాకుండా చూడాలని..
రోడ్డుపై బైఠాయించి నిరసన..
కాలనీలోకి నీరు చేరకుండా చర్యలకు యువకుల వేడుకలు..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోని శ్రీలంక కాలనీలోకి వరద నీరు చేరి రాకపోకలకు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని గురువారం సాయంత్రం పలువురు యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ కుంభ వర్షానికి శ్రీలంక కాలనీ చుట్టూ వరద నీరు చేరడంతో పాటు, రోడ్ల గుండా భారీగా వరద నీరు పారడంతో రాకపోకలకు కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు వరద నీటితో పడరాని పాట్లు పడుతున్నారని ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
పలుసార్లు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదని వారు విమర్శించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో గాలి తిరుపతి, రాము వేమునూరు శేఖర్, జగి శెట్టి మహేష్, గొల్లపల్లి రమేష్ పాల్గొన్నారు.
