పంటల మార్పిడితోనే అధిక దిగుబడి

పంటల మార్పిడితోనే అధిక దిగుబడి

  • వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

జైనూర్, ఆంధ్రప్రభ: రైతులు తాము పండించే పంటల్లో మార్పిడి పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీ శంకర్, శివ లక్ష్మి పేర్కొన్నారు. పంటల మార్పిడి భూసార పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుందని వారు వివరించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ గ్రామపంచాయతీలో రైతులకు ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సేంద్రియ ఎరువుల వాడకం, పంటల సాగు విధానాలపై రైతులకు శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని కోరారు. రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులో వాడటం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా గడించాలో రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యం, కూరగాయలు తినడం వల్ల మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారని వారు సూచించారు. మార్కెట్లో అధిక ధరలు, డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

సేంద్రియ పంటల సాగును ప్రోత్సహిస్తూ సమాజం ఆరోగ్యకరంగా ఉండేలా అందరూ కృషి చేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ఈ అవగాహన సమావేశంలో దుబ్బగూడా సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, వ్యవసాయ అధికారి (ఏఈఓ) టి. వినోద, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply