రాపిడ్ రెస్క్యూ టీం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన రాపిడ్ రెస్క్యూ టీం భవనాన్ని బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గురువారం అటవీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడవి జంతువులు మానవ నివాస ప్రాంతాల్లోకి వచ్చిన సందర్భాల్లో స్థానిక ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల రక్షణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో రాపిడ్ రెస్క్యూ టీమ్‌లు కీలక పాత్ర పోషిస్తూ, మనిషి-జంతు ఘర్షణలను తగ్గించడంలో ముందుండాలని సూచించారు.

ప్రభుత్వం అటవీ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ తరహా సదుపాయాలతో అటవీ శాఖ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. స్థానిక ప్రజలు అడవి జంతువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఘటనలు జరిగినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ విజయ్ కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ పూర్ణచందర్, డిప్యూటీ ఆర్‌ఓ గౌరీ శంకర్, ఎఫ్‌ఎస్‌ఓలు, ఏఎంసీ మాజీ చైర్మన్ కార్కూరి రాంచందర్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్, లీడర్లు దావా రమేష్ బాబు, చిలుముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply