చుండూరు చిన్నారికి రూ.4.72 లక్షల వైద్య సాయం..

చుండూరు, ఆంధ్రప్రభ: చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన చిన్నారి చుండూరు సుహాన్ష్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.4,72,885 వైద్య సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన ఆర్థిక సహాయ పత్రాన్ని వేమూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుహాన్ష్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబును కోరారు. దీనిపై ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని చికిత్సకు సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం రూ.4,72,885 విలువైన వైద్య సహాయాన్ని మంజూరు చేసింది.

ఆర్థిక సహాయ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అత్యవసర వైద్య చికిత్సల సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని చెప్పారు.

వేమూరు నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, అవసరమైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సాయం మంజూరు కావడంపై సుహాన్ష్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, అలాగే ప్రత్యేక చొరవతో తమకు సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.