కడెం ప్రాజెక్టుకు భారీ వరద

గోదావరిలోకి 46 వేల క్యూసెక్కుల నీటి విడుదల

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లాలోని అతిపెద్ద కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు చేరుతోంది. గురువారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 688 అడుగులుగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా 77 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటిమట్టం 693 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కావడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టులోని 18 వరద గేట్లలో 5, 6, 7, 8, 9, 10 నంబర్లకు చెందిన ఆరు గేట్లను 8 అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి 46 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 77 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, నీటిమట్టం 693.700 అడుగులకు చేరినట్లు కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో ఈఈ ప్రవీణ్ కుమార్, డీఈ వీరన్న జలాశయం వద్దే ఉండి నీటిమట్టం, వరద గేట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వారి సూచనల మేరకు చర్యలు చేపడుతున్నారు. మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీఓ అరుణ, కడెం ఎస్సై సాయికిరణ్ ప్రాజెక్టును సందర్శించి నీటిమట్టం, వరద పరిస్థితిని పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.