భీమ్‌గల్ అభివృద్ధి పనుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే వేముల ఆగ్రహం
భీమ్‌గల్ అభివృద్ధి పనుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే వేముల ఆగ్రహం
- నెల రోజుల్లో పనులు పూర్తి చేయకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రస్తుతం అర్ధాంతరంగా నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం భీమ్‌గల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో 75 శాతం పూర్తయిన 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్ వెజ్ మార్కెట్, అసంపూర్తిగా ఉన్న రోడ్లు, భీమ్‌గల్ బస్ డిపో తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.

అనంతరం ఎల్‌జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భీమ్‌గల్‌తో పాటు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ.22 కోట్లతో భవన నిర్మాణం, రూ.5 కోట్లతో వైద్య పరికరాల కొనుగోలు, రూ.8 కోట్లను ఇతర ఖర్చులకు కేటాయించామని తెలిపారు.
తాము అధికారంలో ఉన్న సమయంలోనే రూ.16 కోట్ల వ్యయంతో 75 శాతం పనులు పూర్తి చేసి, కాంట్రాక్టర్‌కు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు మూడు నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. జూలై 14లోగా ఆసుపత్రిని ప్రారంభించకపోతే ప్రజలే కాంగ్రెస్ నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రూ.7 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించామని, రూ.2 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో రెండున్నర సంవత్సరాలుగా పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.

భీమ్‌గల్ బస్ డిపోను గతంలో ఆధునీకరించి విజయవంతంగా నడిపించామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో డిపో కార్యకలాపాలు దెబ్బతిన్నాయని అన్నారు. అలాగే రూ.11.50 కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, బడా భీమ్‌గల్ బ్రిడ్జి మరమ్మతులు కూడా పూర్తికాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చేసిన ప్రధాన డిమాండ్లు:
- జూలై 14లోగా 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించాలి.
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెండింగ్ బిల్లులు చెల్లించి పనులను పునఃప్రారంభించాలి.
- భీమ్‌గల్ బస్ డిపోను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి.
- రూ.11.50 కోట్లతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి.
- బడా భీమ్‌గల్ బ్రిడ్జి మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేయాలి.
ఈ డిమాండ్లను నెల రోజుల్లోగా పరిష్కరించకపోతే బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాసంఘాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృత ఆందోళనలు చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకాటి నరసయ్య, జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, పసుల ముత్యన్న, మొయిజ్, శివసారి నర్సయ్య, మల్లెల ప్రసాద్, బీ. నర్సయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
