మద్యం రహిత గ్రామం దిశగా అడుగు

మద్యం రహిత గ్రామం దిశగా అడుగు
డోంగ్లి, ఆంధ్రప్రభ:
మద్యపానం మహమ్మారి వల్ల సమాజంలో, కుటుంబాలలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక నష్టాలను అరికట్టేందుకు కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని ‘ధోతి’ గ్రామం ఒక అద్భుతమైన నిర్ణయంతో ఆదర్శంగా నిలిచింది. గ్రామాన్ని మద్యం రహితంగా మార్చేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ నేతృత్వంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు , గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామ సభలో ఒక చారిత్రాత్మక ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే మే 20వ తేదీ నుండి ధోతి గ్రామ పరిధిలో సంపూర్ణ మద్యపాన నిషేధం కఠినంగా అమల్లోకి రానుంది.
20,000 జరిమానా.. పోలీసుల ద్వారా చట్టపరమైన చర్యలు!
గ్రామ సభలో తీసుకున్న తీర్మానం ప్రకారం.. మే 20 నుండి ధోతి గ్రామ పరిధిలోని ఏ కిరాణా షాపులోనైనా, బెల్ట్ షాపుల్లోనైనా లేదా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా మద్యం విక్రయించినట్లు తేలితే వారికి రూ. 20,000 భారీ జరిమానా విధించనున్నారు. కేవలం జరిమానాతోనే వదలకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీస్ శాఖ ద్వారా కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని గ్రామ పాలకమండలి హెచ్చరించింది.
ఎస్సైకి తీర్మాన పత్రం అందజేత
ఈ చారిత్రాత్మక తీర్మానం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు సర్పంచ్ సంగ్రామ్ పటేల్ చొరవ తీసుకున్నారు. సోమవారం ఈ తీర్మానం కాపీని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై మోహన్ రెడ్డికి అధికారికంగా అందజేసి, గ్రామంలో మద్యం నిర్మూలనకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంగ్రామ్ పటేల్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, ప్రజలు కలిసికట్టుగా సంకల్పిస్తే గ్రామాభివృద్ధిని, మార్పును ఎలా సాధించవచ్చో ధోతి గ్రామం నిరూపించిందన్నారు. మద్యపాన నిషేధంతో పేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషం పెరుగుతుందని, యువత తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు తగ్గి, శాంతిభద్రతలు మెరుగుపడటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ధోతి గ్రామ నాయకత్వాన్ని, సర్పంచ్‌ను గ్రామ ప్రజలు మరియు మహిళలు ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ధోతి గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు.
