మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది
మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది
సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఉపాధి రంగాల్లో విశేష పురోగతి సాధించాం…
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి
తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అపూర్వమైన పురోగతి సాధించిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు.
“సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్” లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించి గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
వ్యవసాయ రంగంలో కూడా గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొంటూ, ఆహార ధాన్యాల ఉత్పత్తి 71 శాతం మేర పెరిగిందని తెలిపారు. దేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, 2014-15లో 146.3 మిలియన్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2024-25 నాటికి 247 మిలియన్ టన్నులకు పెరిగిందని వివరించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్టార్టప్ ఇండియాకు పెద్దపీట వేయడం ద్వారా దేశంలో లక్షలాది స్టార్టప్ సంస్థలు ఏర్పడ్డాయని, ఉద్యోగాలు వెతికే స్థితి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత ఎదిగిందని చెప్పారు. ముద్రా రుణాల ద్వారా కోట్లాది చిన్న వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారని పేర్కొన్నారు.
దేశంలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తూ రామరాజ్యాన్ని తలపించే విధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద కలలుగన్న నవభారత నిర్మాణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, ఇటీవల తిరుపతి దామినేడు వద్ద జరిగిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని చెప్పారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఆధారరహితమని, ఆరోపణల కంటే ఆధారాలతో మాట్లాడాలని సూచించారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతి, అరాచకాల దిశగా వెళ్లిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పోలవరం, అమరావతి, ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా, భారతదేశాన్ని స్వర్ణభారత్‌గా తీర్చిదిద్దడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వరప్రసాద్, బీజేపీ నాయకులు అజయ్ కుమార్, పొనగంటి భాస్కర్, కరుణాకర్ రెడ్డి, నాగేంద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
