South Coast Railway | రైల్వే భద్రత, సేవల మెరుగుదలపై సమీక్ష
South Coast Railway | రైల్వే భద్రత, సేవల మెరుగుదలపై సమీక్ష
South Coast Railway | అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే అభివృద్ధి
విజయవాడ–గూడూరు మార్గం సమగ్ర పరిశీలన
అమృత్ భారత్ పథకం పనుల పురోగతి
ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
South Coast Railway | ఎన్టీఆర్, ఆంధ్రప్రభ బ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా ఆధునికీకరిస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ పేర్కొన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ-గూడూరు రైల్వే మార్గాన్ని శుక్రవారం ఆయన సమగ్రంగా పరిశీలించారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, దక్షిణ తీర రైల్వే ప్రధాన విభాగాధిపతులు, సీనియర్ అధికారులు ఆయన వెంట ఉన్నారు.
పరిశీలనలో భాగంగా కృష్ణా కెనాల్ జంక్షన్–పెదవడ్లపూడి జంక్షన్ మధ్య కొనసాగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులను జనరల్ మేనేజర్ ప్రత్యేకంగా సమీక్షించారు. నిర్మాణ నాణ్యత, పనుల పురోగతి, ప్రాజెక్టు అమలును పరిశీలించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచే విధంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తెనాలి రైల్వే స్టేషన్‌లో టికెటింగ్ కౌంటర్లు, వేచి ఉండే హాళ్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
బాపట్ల రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ పనులను సమీక్షించి, భద్రతా ప్రమాణాలు, నాణ్యత విషయంలో రాజీపడవద్దని అధికారులకు స్పష్టం చేశారు.
చీరాల రైల్వే స్టేషన్‌లో యార్డు పాయింట్లు, క్రాసింగ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్టేషన్ పునర్నిర్మాణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, సూచిక బోర్డులు, స్టేషన్ అందాన్ని మెరుగుపరిచే పనుల పురోగతిని సమీక్షించారు.
ఒంగోలు రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన సందీప్ మాథూర్, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఆధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రాకపోకల నిర్వహణ, దివ్యాంగుల సౌకర్యాలు, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి పనులను సమీక్షించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
బిట్రగుంటలో క్రూ లాబీని పరిశీలించిన జనరల్ మేనేజర్, రన్నింగ్ సిబ్బందికి కల్పిస్తున్న విశ్రాంతి సౌకర్యాలు, భద్రతా విధానాలు, కౌన్సెలింగ్ వ్యవస్థలను సమీక్షించారు. సిబ్బంది సంక్షేమం, భద్రత రైల్వే సేవల నాణ్యతను పెంచడంలో కీలకమని పేర్కొన్నారు.
పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, సిబ్బందితో సమావేశమైన సందీప్ మాథూర్ ప్రాంతీయ రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల అవసరాలు, మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దక్షిణ తీర రైల్వేలో భద్రత, ఆధునికీకరణ, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ పర్యటనలో డీఆర్ఎం మోహిత్ సోనాకియాతో పాటు ప్రధాన చీఫ్ ఇంజనీర్ బీఎస్కే రాజ్‌కుమార్, ప్రధాన చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ ఓబీ సురేష్ కుమార్, ప్రధాన చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్ కుమార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
