రైతన్న పొలాలకు జలకళ..

  • కూటమి పాలనలో సాగునీటి భరోసా
  • పెద్దవరంలో 1,682 ఎకరాల ఆయకట్టుకు ఎత్తిపోతల పథకం ప్రారంభం
  • స్విచ్ ఆన్ చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మండలం పరిధిలోనిపెద్దవరంగ్రామంలోకేతవీరునిపాడు–గుత్తవారిపాలెం ప్రాంతాలకు సంబంధించిన 1,682 ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాన్ని నియోజకవర్గ పరిశీలకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ , అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సాగునీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా 1,682 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనం కలగడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి పోస్తోందని, రైతుల పొలాలకు నీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తంగిరాల సౌమ్య స్పష్టంచేశారు.


నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు తోడు.. స్థానికంగా సాగునీటి వసతుల మెరుగుదలకు కూడా పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రైతుల కళ్లలో ఆనందం.పొలాల్లో పచ్చదనం.. ఇదే కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనకు నిదర్శనమని అన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం, లో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.