రేగొండ, గోరుకొత్తపల్లి మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మండల స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం

రేగొండ (గోరుకొత్తపల్లి), ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, గోరుకొత్తపల్లి మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం రేగొండ, గోరుకొత్తపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో గోరుకొత్తపల్లి మండల సంక్షేమ పథకాల అమలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులపై నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలాల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్ తదితర శాఖల పనితీరును సమీక్షించి, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కాలానుగుణ వ్యాధుల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని చెప్పారు. అలాగే గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి గ్రామ అవసరాలను గుర్తించి సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించాలని మండల స్థాయి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్‌రావు, తహసీల్దార్లు శ్వేతారావు, హేమలత, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ది వాసుదేవరెడ్డి, జీ. సారయ్య, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.