మిషన్ భగీరథ ఏఈ అనూష హఠాన్మరణం
- గుండెపోటుతో ఆసుపత్రిలో కన్నుమూత
- సంతాపం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం మిషన్ భగీరథ ఏఈ అనూష ( 33 ) హఠాన్మరణం చెందారు. వనస్థలిపురం లోని వారి ఇంట్లో తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిన అనూష ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులపాటు నగరంలోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఇబ్రహీంపట్నం సహాయక ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె అబ్దుల్లాపూర్ మెట్ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అనూష కు భర్త , ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
చిన్న వయసులోనే మంచి అధికారినిగా గుర్తింపు పొందిన అనూష ఆకస్మిక మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభం నుండి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆమె చాలా కష్టపడి పనిచేశారని వారు గుర్తు చేశారు. ఎఇ అనూష ఆకస్మిక మరణంతో ఇబ్రహీంపట్నం లో విషాద ఛాయలు అలముకున్నాయి.
