KC-135 Strato | అమెరికాలో హై అలర్ట్!

KC-135 Strato | అమెరికాలో హై అలర్ట్!

KC-135 Strato | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : అమెరికా వైమానిక దళానికి చెందిన బోయింగ్ KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం అదృశ్యం కావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మే 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయల్దేరిన ఈ విమానం, గగనతలంలో ఉండగానే తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

విమానం గాలిలో ఉండగానే అత్యవసర పరిస్థితిని సూచించే ‘7700’ (Squawk 7700) అనే అంతర్జాతీయ ప్రమాద సంకేతాన్ని జారీ చేసింది. సాధారణంగా ఇంజిన్ వైఫల్యం, మంటలు, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు పైలట్లు ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ నుండి టేకాఫ్ అయిన ఈ విమానం, ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా రాడార్ సంకేతాలు నిలిచిపోయాయి.

ఖతార్ సమీపంలోని గగనతలంలో విమానం వేగంగా కిందకు దిగుతున్నట్లు రాడార్‌లో రికార్డయ్యింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. విమానం గల్లంతైన సమాచారం అందగానే ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ నుండి అమెరికాకు చెందిన రెండు H125 హెలికాప్టర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ (గాలింపు చర్యల) కోసం రంగంలోకి దిగాయి. అయితే, విమానం క్రాష్ అయిందా లేక ఏదైనా అత్యవసర ల్యాండింగ్ చేసిందా అనే విషయంపై అమెరికా రక్షణ విభాగం (CENTCOM) ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

బోయింగ్ KC-135 స్ట్రాటోట్యాంకర్ అనేది అమెరికా సైన్యానికి అత్యంత కీలకమైనది. ఇది గాలిలో ఉన్న యుద్ధ విమానాలకు ఇంధనాన్ని నింపే “ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్” లాగా పనిచేస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ భారీ విమానం గల్లంతవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply