Diesel restrictions India | బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రభుత్వ కఠిన చర్యలు
Diesel restrictions India | బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రభుత్వ కఠిన చర్యలు
Diesel restrictions India | ఇంధన సరఫరా రక్షణకు కేంద్ర చర్యలు
రిటైల్ అమ్మకాలపై కొత్త నియంత్రణలు
బల్క్ కొనుగోళ్లపై నిషేధ కారణాలు
ధరల తేడా మరియు మార్కెట్ ప్రభావం
Diesel restrictions India | న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇంకా ఒక కొలిక్కి రానందున ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా కేంద్రం మరో చర్య తీసుకుంది. పెట్రోల్ రిటైల్ అమ్మక కేంద్రాల్లో భారీగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై నిషేధం విధించింది. రాయితీ రిటైల్ ధరలకు పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం వల్ల సాధారణ వినియోగదారులకు ఇంధన లభ్యతకు అంతరాయం కలుగుతుందని కేంద్రం బల్క్ అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ కస్టమర్లు బల్క్ ప్రొక్యూర్మెంట్ మార్గాల ద్వారానే సరఫరాలను పొందాలని ఆదేశించింది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జూన్ 11న జారీ చేసిన మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ ఉత్తర్వు 2026 పేరుతో ఈ నిషేధాన్ని విధించింది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్రమ విక్రయాలను, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు సరఫరాల్లో అంతరాయాలను నివారించడానికి రిటైల్ అవుట్లెట్ల వద్ద 200 లీటర్లకు మించి ఒక కస్టమర్‌కు విక్రయించకూడదని కేంద్రం ఆంక్షలు విధించింది. బల్క్ కస్టమర్లు పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ దేశవ్యాప్తంగా కొరత లేకుండా లభించేలా చేయడం, నిల్వ చేయడం, దారి మళ్లించడాన్ని అరికట్టేందుకు, దేశవ్యాప్తంగా సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం కోసమే నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పెట్రోలియం సరఫరా వ్యవస్థలు, షిప్పింగ్ రవాణా, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఈ ప్రకటనలో ప్రభుత్వం ప్రస్తావించింది. రిటైల్, బల్క్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం వల్ల బల్క్ వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుంచి డీజిల్, పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ లీటర్ రిటైల్ ధర 95.20 రూపాయలు ఉంటే, బల్క్ వినియోగదారులకు కమర్షియల్ వినియోగ డీజిల్ లీటర్ ధర 134.50 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ఇంధన ధరలను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం రిటైల్ డీజిల్ రేట్లు తక్కువగా, కమర్షియల్ వినియోగ డీజిల్ ధరలు భారీగా పెంచింది. రిటైల్ రేట్లు నియంత్రణలో ఉంటే, పారిశ్రామిక కార్యకలాపాల కోసం వినియోగించే డీజిల్ ధరలు మాత్రం మార్కెట్ అనుసంధానంగా ఉన్నాయి. రేట్లతో భారీగా తేడా ఉండటంతో ఇటీవల కాలంలో రిటైల్ అవుట్లెట్ల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాల్లో అసాధారణ పెరుగుదల కనిపిస్తోందని, పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుంచే కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణమని పెట్రోలియం శాఖ తెలిపింది.
ఒక కస్టమర్ లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్‌కు మించి విక్రయించరాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ రిటైల్ అవుట్లెట్లను ఆదేశించింది. రిటైల్ కస్టమర్లకు కొరత రాకుండా చూసేందుకు ఈ నియంత్రణ విధించినట్లు స్పష్టం చేసింది. ప్రైవేట్ చమురు సంస్థలు డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెంచిన తరువాత బల్క్ కొనుగోలుదారులు ప్రభుత్వ రంగ చమురు సంస్థల అవుట్లెట్ల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించారు.
దీని ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల రిటైల్ అవుట్లెట్ల అమ్మకాలు మే నెలలో గత ఏడాది మే నెలతో పోల్చితే 327 జిల్లాల్లో 10 శాతం, 80 జిల్లాల్లో 30 శాతం పెరిగాయి. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, బల్క్ వినియోగదారులకు విక్రయించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది. ఉల్లంఘించిన వారికి నిత్యావసర వస్తువుల చట్టం కింద జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
