ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగాలి
- జిల్లా వైద్యాధికారి రత్న మన్మోహన్
శావల్యాపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా మండల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చుక్కా రత్న మన్మోహన్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా వైద్యాధికారి రత్న మనోహన్ సోమవారం రోజున శావల్యాపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని లేబరేటరీ, ఔషధాల పంపిణీ విభాగం, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, వార్డులు, కంప్యూటర్ విభాగం తనిఖీ చేసి ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆసుపత్రి పరిశుభ్రత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గర్భిణీ స్త్రీలు కాన్పుల కోసం వినుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులలో తప్పనిసరిగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వాసుపత్రులలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మురళీకృష్ణ, ఆరోగ్యశ్రీ డీసీ చంద్రశేఖర్, వైద్యులు డా. రాధాకృష్ణ, డా.రమ్య, సూపర్వైజర్లు నారాయణమ్మ, ఏడుకొండలు, ఉమాదేవి, స్టాఫ్ నర్స్ ధనలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, ఫార్మసిస్ట్ లక్ష్మీనారాయణ, ఎంఎల్హెచ్‌పీలు పావని, పృథ్వి, సంకీర్తనతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
