Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
Indrakeeladri | కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఒక్కరోజులో 43 వేల మందికి పైగా దర్శనం..
Indrakeeladri | ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వారాంతపు సెలవులు, ఇంకా కొనసాగుతున్న వేసవి విరామం కారణంగా ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు పాఠశాలలు మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
సోమవారం ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే దర్శన క్యూలైన్లలో భక్తులు బారులు తీరగా, ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శనం మార్గాల్లో రద్దీ నెలకొంది. దర్శనం అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, ప్రసాదాలు స్వీకరించారు.
దేవస్థానం విడుదల చేసిన రోజువారీ గణాంకాల ప్రకారం, 5,945 దర్శన టికెట్లు జారీ చేయగా, మొత్తం 43,148 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు 67,942 యూనిట్ల ప్రసాదాలను పంపిణీ చేశారు. హుండీ కానుకలు, విరాళాల రూపంలో రూ.3,48,525 ఆదాయం సమకూరింది.
అలాగే 337 మంది భక్తులు వివిధ సేవల్లో పాల్గొనగా, 1,725 మంది తలనీలాలు సమర్పించారు. దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో 7,976 మంది భక్తులు భోజన ప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, అన్నదాన సేవలను మరింత విస్తరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
CLICK HERE TO READ Temple Rush | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
