ఇంధన ధరలపై ఎగిసిపడిన సీపీఎం అగ్రహ జ్వాల
ఇంధన ధరలపై ఎగిసిపడిన సీపీఎం అగ్రహ జ్వాల
వీఆర్ పురం, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వీఆర్ పురం మండలంలో సీపీఎం శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ రేకపల్లి జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఉధృత రాస్తారోకో, నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తాజాగా వంట గ్యాస్ సిలిండర్‌పై పెంచిన రూ.29 ధరను వెంటనే రద్దు చేయాలని, కృష్ణా-గోదావరి బేసిన్‌లో లభ్యమవుతున్న సహజ వనరుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు భుజాలపై గ్యాస్ సిలిండర్లు మోస్తూ, తాడుతో ఆటోలను లాగుతూ ప్రభుత్వాల విధానాలను నిరసించారు.
కార్పొరేట్లకు సబ్సిడీలు.. సామాన్యుడిపై భారాలు: సున్నం రాజులు
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సున్నం రాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతూ చమురు ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఇప్పుడు గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై కూడా రూ.29 పెంచడం ప్రజలపై మరింత భారం మోపినట్లేనని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే గ్యాస్ ధరలు పెంచుతూ, విమాన ఇంధన ధరలను తగ్గించడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు.
‘జీడీపీ’ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంపేనా?
అధికారంలోకి రాకముందు జీడీపీ పెంచుతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుకే పరిమితమైందని సున్నం రాజులు విమర్శించారు. ప్రజలకు పొదుపు పేరుతో సలహాలు ఇస్తున్న పాలకులు తామే చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ విలాసవంతమైన జీవనం సాగిస్తున్నారని ఆరోపించారు.
కృష్ణా-గోదావరి గ్యాస్‌పై రాష్ట్రానికి వాటా ఇవ్వాలి
కృష్ణా-గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో లభ్యమవుతున్న గ్యాస్ నిక్షేపాల ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు అందడం లేదని సీపీఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం వాటా కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు సోయం చిన్నబాబు, మండల కార్యదర్శివర్గ సభ్యులు పంకు సత్తిబాబు, కారం సుందరయ్య, వడ్లది రమేష్, ఎంపీటీసీ సభ్యుడు పూనం ప్రదీప్ కుమార్, మండల నాయకులు తుర్రం సిరపు తాతబాబు, గుండెపూడి లక్ష్మణరావు, ఆత్మకూరు కాంతారావు, సారా పాండు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు.
