సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి..
మక్తల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గురువారం పరిశీలించారు.
మండల పరిధిలోని కాట్రేవుపల్లి వద్ద మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించిన మంత్రి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకోనున్నారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా-కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులు వివరించనున్నారని చెప్పారు.
అనంతరం కాట్రేవుపల్లి గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించనున్నారని తెలిపారు. అలాగే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.

సాయంత్రం గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్‌ఎల్‌ఐఎస్ స్టేజ్-1 పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం సోమశిలలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో బికారు ఫౌండేషన్ చైర్మన్ గోవినోళ్ల బాలకృష్ణారెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
