నల్లొండ – ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది సజీవ సమాదై ఉంటారని సహాయ రక్షణ బృందాలు ప్రకటించాయి.. నెల రోజుల తర్వాత కానీ మృతదేహాలు తీయలేమంటూ క్లారిటీ ఇచ్చింది ఎన్డీఆర్ఎఫ్. టన్నెల్ లో చిక్కుకున్న వాళ్ళు 48 గంటలుగా ఆక్సీజన్ లేకపోవడంతో ప్రాణాలతో ఉంటారని భావించలేమని తెలిపారు. అక్కడ ఉన్న మృతదేహాలను టన్నెల్ బోరింగ్ మిషన్ ను పూర్తిగా కట్ చేయాల్సిందేనని ఎన్టీఆర్‌ఎఫ్ అధికారులు అంటున్నారు. శిథిలాల తొలగించడానికి దాదాపు నెల రోజుల సమయం పడుతుందని…అప్పుడుగాని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేమని చెబుతున్నారు అధికారులు. నేటి ఉదయం మద్రాస్ ఐఐటి నుంచి వచ్చిన నిపుణుల బృందంతో లోపలకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ పరిస్థితిని సమీక్షించారు. టన్నెల్ ప్రమాదం జరిగిన 14వ కిలో మీటర్ నుంచి వెననకు 11 కిలో మీటర్ వరకు మొత్తం నీరు, బురద కొండ రాళ్లతో మూసుకుపోయిందని గుర్తించారు.. మూడు కిలోమీటర్ల పడిన కొండరాళ్లతో కూడిన బురదను, నీళ్లను తొడటం కష్టసాధ్యమైన విషయమని మద్రాస్ ఐఐటి నిపుణులు తెలిపారు..
ఇక టన్నె ల్ లో 14 కిలో మీటర్ల ప్రాంతంలో ప్రమాదం జరిగితే అక్కడి నుంచి దాదాపు 500 మీటర్ల వరకు మట్టి, సిమెంట్ రింగుల శిథిలాలతో సొరంగం మూసుకుపోయిందని తెలిపారు. ఇదే ఇప్పుడు సహాయ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంటున్నారు. సాధారణంగా సారంగంలోకి వెళ్లేందుకు, కార్మికులను, యంత్ర పరికరాలను తరలించేందుకు రైల్వే ట్రాక్ను ఏర్పాటు చేశారు.. దీంతో వేరే భారీ యంత్రాలు కూడా లోపలికి తీసుకుపోయే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. కూలిపోయిన శిథి లాలను తరలించాలంటే ప్రస్తుతం ఏకైక మార్గం రైల్వేట్రాక్. ఆ మార్గంలోనే శిథి లాలను బయటకు తీసుకురావాల్సి ఉంది. ట్రాక్ కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నీటిలో మునిగిందని అన్నారు. నడుము లోతు వరకు నీరు, బురద పేరుకుపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కరెంటును కూడా పునరద్ధరించలేని పరిస్థితి అని చెప్పారు. సహాయ కార్యక్రమాలు నిపుణుల సలహాతో కొనసాగిస్తామని తెలిపారు.
రంగంలో ఆక్వా ఐ కెమెరా..
ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో బురద సమాధిలో చిక్కిన మృతదేహాలను గుర్తించేందుకు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించాలని సహాయక బృందాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించింది. ఆక్వా ఐ కెమెరాతో ఎనిమిది మందిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఎల్ అండ్ టీ సంస్థ తమ ఆక్వా ఐ కెమెరాను దోమకుంటకు పంపించింది. ఈ కెమెరాలో 50 అడుగుల లోతులోని లక్ష్యాలను గుర్తించే సాంకేతికత ఉంది. ఈ స్థితిలో సోరంగంలో మూడు కిలోమీటర్లలో పేరుకుపోయిన బురద, ఇతర శిథిలాల్లో అడుగున చిక్కిన మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిది మంది మరణ వార్త ప్రపంచానికి తెలియనుంది.
వేగంగా గాలింపు చర్యలు..
దుర్ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోగా.. సహాయ బృందాల అన్వేషణ శరవేగంగా సాగుతోంది. సహాయక చర్యలను రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సాగర్ ఎమ్మెల్యే జై వీర రెడ్డి ఉన్నారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ బీ బాలకృష్ణ, ఎస్పీ గైక్వాడ్ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి సహాయ బృందాలు దశలవారీగా పని చేస్తున్నారు. ఇప్పటికే టీబీఎం ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి 100 మీటర్లు దూరం వెళ్లారు. కానీ అక్కడ బురదతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది.