తహసీల్దార్ పదోన్నతులతో రెవెన్యూ శాఖలో కొత్త ఉత్సాహం..
తహసీల్దార్ పదోన్నతులతో రెవెన్యూ శాఖలో కొత్త ఉత్సాహం..
296 మంది డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు
దీర్ఘకాలిక సమస్య పరిష్కరించిన ప్రభుత్వానికి ఏపీఆర్‌ఎస్‌ఏ కృతజ్ఞతలు
ఒకే రోజులో డీపీసీ, ఉత్తర్వులు, జిల్లా కేటాయింపులు పూర్తి
ప్రజా సేవలు మరింత సమర్థవంతంగా అందించే అవకాశం
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ పదోన్నతుల ప్రక్రియ పూర్తికావడంతో రెవెన్యూ శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది. డిప్యూటీ తహసీల్దార్ హోదా నుంచి తహసీల్దార్ హోదాకు పదోన్నతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లలో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పదోన్నతుల ఉత్తర్వులు, జిల్లా కేటాయింపు ఉత్తర్వులను సైతం ఒకే రోజు జారీ చేసి దాదాపు 300 తహసీల్దార్ పోస్టులను భర్తీ చేయడం విశేషమని పేర్కొన్నారు.
ఈ పదోన్నతుల ద్వారా జోన్-1లో 59 మంది, జోన్-2లో 84 మంది, జోన్-3లో 49 మంది, జోన్-4లో 104 మంది చొప్పున మొత్తం 296 మంది డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతులు పొందారని తెలిపారు. రెవెన్యూ శాఖ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల కారణంగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్కు అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పదోన్నతులకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ప్రక్రియ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జి. జయలక్ష్మి, జి. సాయి ప్రసాద్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారులు, సిబ్బంది కృషిని అసోసియేషన్ అభినందించింది. రాష్ట్రంలో ఇంకా కొన్ని జోన్లలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తహసీల్దార్ పోస్టుల భర్తీతో ఓటర్ల జాబితాల నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీ-సర్వే వంటి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ అధికారుల్లో ఈ నిర్ణయం నూతనోత్సాహాన్ని నింపిందని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు బొప్పరాజు, రామిశెట్టి వెంకట రాజేష్ తెలిపారు.
