Utkoor | గ్రామసభ బహిష్క‌రించిన ప్ర‌జ‌లు

Utkoor | గ్రామసభ బహిష్క‌రించిన ప్ర‌జ‌లు

Utkoor |ఊట్కూర్, ఆంధ్రప్రభ : మక్తల్ – నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ఊట్కూర్ పెద్ద చెరువు రిజర్వాయర్‌గా మారనున్న నేపథ్యంలో ఊట్కూర్ గ్రామంలో ముంపు భయం తీవ్రతరం అవుతోంది. రిజర్వాయర్ ఏర్పాటు చేయకన్న ముందే ముంపు గ్రామంగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని గత కొన్ని నెలలుగా ఆందోళన లు చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని నాయకులు ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల కిందట జిల్లా కలెక్టర్ చిత్తా పట్నాయక్ వినతి పత్రం సమర్పించిన ఇంతవరకు స్పందించలేదని ఆరోపించారు. ఇంజనీరింగ్ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని గోడు వెళ్ళబుచ్చిన ఆ దిశగా అధికారులు ఆలోచించడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసి బుధవారం ఉట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన పునరావాసం పునరాశ్రయం గ్రామసభను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ నాయకులు గ్రామ ప్రజలు బహిష్కరించారు.ఇప్పటికే ఉన్న చెరువు సామర్థ్యంతోనే గ్రామంలోని పలు ఇళ్ల పునాదుల్లో నీటి ఊట కొనసాగుతోందని, భవిష్యత్తులో చెరువు పెద్ద రిజర్వాయర్‌గా మారితే గ్రామానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. చెరువు కింద ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లకు నీటి ఊట సమస్య తీవ్రంగా ఉందని, రిజర్వాయర్‌గా మారితే ఊట్కూర్ మొత్తం ముంపు ముప్పులో పడుతుందని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశంపై బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామంలో పునరావాసం–పునరాశ్రయం అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించారు. అయితే ఈ గ్రామసభపై గ్రామస్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గ్రామ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని మాజీ సర్పంచ్ భాస్కర్, ఆర్డీవో రామచంద్ర నాయక్‌ను ప్రశ్నించారు.
గ్రామసభలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే భూముల వివరాలపై అధికారులు స్పష్టత ఇస్తున్నప్పటికీ, చెరువు కింది ఊట్కూర్ గ్రామంలోని శివాజీ నగర్, దేవినగర్, పెద్ద పీర్లగడ్డ, ఈశ్వర్ మందిర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే చెరువు ప్రభావం ఉందని తెలిపారు. పాత చెరువు ఆయకట్టుతోనే పలు వీధులు ప్రభావితమవుతున్నాయని, రిజర్వాయర్‌గా మారితే నివాస ప్రాంతాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం సరేనని, అయితే ఇళ్లు, వీధులు, నివాస ప్రాంతాలు ఊటతో ప్రభావితమవుతున్న వారిని ఎందుకు నిర్వాసితులుగా గుర్తించట్లేదని గ్రామస్తులు ప్రశ్నించారు. ప్రభావిత ప్రాంతాలను గుర్తించకుండా, నష్టాన్ని అంచనా వేయకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాల్లో నీటి ఊట ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఊట్కూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా అధికారికంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభావిత ప్రాంతాల ప్రజలనూ నిర్వాసితులుగా గుర్తించి తగిన నష్టపరిహారం, పునరావాసం కల్పించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఊట్కూర్ గ్రామ భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ ప్రాజెక్టుపై సమగ్ర ప్రభావ అంచనా నిర్వహించి, భూ నిర్వాసితులతో పాటు నివాస ప్రాంతాల్లో ప్రభావితులైన ప్రజల సమస్యలకు కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చింత రవి, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, బిజెపి నాయకులు కృష్ణయ్య గౌడ్, రమేష్, బీఆర్ఎస్ నాయకులు కోరం శివారెడ్డి, ఆనంద్ రెడ్డి, తరుణ్ రెడ్డి, విబాధూర్ రహేమాన్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply