ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
గ్రామీణాభివృద్ధి పనులను పారదర్శకంగా నిర్వహిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న రోడ్డు చదును పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పనుల పురోగతిని కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న కలెక్టర్, అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి రోజువారీ హాజరు నమోదు, కూలి చెల్లింపులు సమయానికి అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి పనిస్థలాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కీలక పథకమని తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న రోడ్డు చదును, చెరువుల అభివృద్ధి, వాననీటి సంరక్షణ పనులు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సూచించారు.
రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు గ్రామ రహదారుల అభివృద్ధితో రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.
కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల్లో పారదర్శతకు ప్రాధాన్యం
