అభివృద్ధి పనులకు శ్రీకారం..

హనుమకొండ, ఆంధ్రప్రభ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

సోమవారం 30వ డివిజన్ బాలసముద్రం వెహికల్ షెడ్ ప్రాంతంలో రూ.71 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ నిర్మాణానికి, అలాగే శ్రీనివాస కాలనీలో రూ.32 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రతి ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం రూ.1.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంత సారంగపాణి, మాజీ కార్పొరేటర్ మాధవి రెడ్డి, తోట వెంకన్న, పవన్ తదితరులు పాల్గొన్నారు.