sammakka | భక్తుల నరకయాతన
sammakka | భక్తుల నరకయాతన
- మేడారంలో ప్రయాణికుల అవస్థలు
- వేళకురాని ఆర్టీసీ బస్సులు
- గంటలకొద్దీ ఎదురుచూపులు
sammakka | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రెండు రోజులుగా మేడారం భక్తులతో పోటెత్తింది. జాతరకు భారీగా జనం తరలివచ్చారు. సమ్మక్క సారక్కలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి అవస్థలు తప్పడం లేదు. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులు రాక భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో లేక చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని ఆందోళన చెందుతున్నారు.
దర్శనం సాఫీగా జరిగినా, తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. గంటల కొద్దీ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో మేడారం నుంచి వెళ్లే బస్సులను మేడారం-నార్లాపూర్-పస్రా మీదుగా దారి మళ్లిస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రం నుంచి గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామానికి 15 కి.మీ మేర బస్సుల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వన్‌వే రూట్ ఏర్పాటు చేసినప్పటికీ ఆర్టీసీ బస్సులు వెళ్లే తాడ్వాయి, మేడారం మార్గంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
