చెత్తాచెదారంతో నిండిన ప్రభుత్వ బావి..

చెత్తాచెదారంతో నిండిన ప్రభుత్వ బావి..

  • అంటువ్యాధుల భయంతో 2వ వార్డు ప్రజలు
  • చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోయిన బావి
  • వర్షాకాలం నేపథ్యంలో ప్రజారోగ్యంపై ఆందోళన

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆస్తిగా ఉన్న ఓ బావి ప్రస్తుతం చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారింది. బావిలోని నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లుతుండటంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

నల్లబెల్లి మండల కేంద్రంలోని 2వ వార్డులో ఉన్న ఈ ప్రభుత్వ బావి ఒకప్పుడు ప్రజల అవసరాలకు ఉపయోగపడేది. అయితే ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. బావి పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులను సంరక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బావిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కనకం ప్రణీత్ మాట్లాడుతూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బావిని శుభ్రపరచడంతో పాటు రక్షణ గోడ లేదా భద్రతా నెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడుబడిన ఈ బావిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply