లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

చేవెళ్ల, ఆంధ్రప్రభ : పేదింటి ఆడబిడ్డ చిరునవ్వే కల్యాణ లక్ష్మి పథకం విజయానికి నిదర్శనమని చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య అన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల మండలం, మున్సిపాలిటీ పరిధికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేవెళ్ల మండలం మరియు మున్సిపాలిటీకి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ.38,00,618 విలువ గల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పొల్యూషన్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పెంటయ్య గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.