మూడు వేదికల్లో 32 మ్యాచులు
మూడు వేదికల్లో 32 మ్యాచులు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదవ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ సీజన్‌ను రాష్ట్రంలోని మూడు వేదికల్లో నిర్వహించాలని ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. జూన్ 9న విశాఖపట్నం వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, జూన్ 30న మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 32 మ్యాచ్‌లు డే అండ్ నైట్ పద్ధతిలో జరగనున్నాయి.
వేదికలు , షెడ్యూల్ వివరాలు:
-విశాఖపట్నం: జూన్ 9 నుండి 14 వరకు 11 మ్యాచులు.
-కడప: జూన్ 17 నుండి 21 వరకు 9 మ్యాచులు.
-మంగళగిరి: జూన్ 24 నుండి 30 వరకు 12 మ్యాచులు.
క్రీడాకారుల ప్రయాణం, విశ్రాంతి కోసం నాలుగు రోజులను కేటాయించారు. ఈ మ్యాచ్‌లన్నింటినీ జీయో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఐపీఎల్ ఆటగాళ్లతో సందడి…
ఏపీఎల్‌లో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏసీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ సీజన్‌లో రికీ భుయ్, బండారు అయ్యప్ప, త్రిపురణ విజయ్, పైలా అవినాష్, అండర్-19 ఇండియా టీమ్ ప్లేయర్ రషీద్ వంటి ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ఈ లీగ్ ఒక వేదికగా నిలుస్తుందని అసోసియేషన్ వర్గాలు భావిస్తున్నాయి.
అభివృద్ధి బాటలో స్టేడియాలు..
గత సీజన్ల వరకు కేవలం విశాఖపట్నానికే పరిమితమైన ఏపీఎల్, ఈసారి కడప మరియు మంగళగిరి స్టేడియాలకు విస్తరించింది. ముఖ్యంగా మంగళగిరి స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యాచులు నిర్వహించేందుకు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నేతృత్వంలో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే స్టేడియానికి వెళ్లే మార్గాన్ని మెరుగుపరచడంతో పాటు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు.
గ్రామీణ క్రీడాకారులకు ప్రాధాన్యత..
ఏపీఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసి, వారిని ఐపీఎల్ , జాతీయ స్థాయికి చేర్చేలా ప్రోత్సహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఏపీ క్రికెట్ బ్రాండ్ ప్రతిష్టను పెంచే దిశగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

