మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

సంగారెడ్డిలో నిర్మలజగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

సంగారెడ్డి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు ఇప్పటివరకు రూ.2 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పూర్తిస్థాయిలో అందజేస్తోందని చెప్పారు. పట్టణంలో 212 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో అనర్హులకు కేటాయింపులు చేసిందని ఆరోపించారు.

అప్పట్లో అధికారులు ప్రజలకు అందుబాటులో లేరని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఇందిరా శక్తి పథకం కింద 119 మందికి రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం రెండు రంగుల్లో చీరలను పట్టణంలోని 29 వేల మంది మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనిత, కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, టీఎంసీ విజయభారతి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply