గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
- అధికారులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన
కోడూరు, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన కోడూరులోని ఎంపీడీఓ కార్యాలయం సందర్శించారు. ఎంపీడీఓ, గ్రామ ప్రత్యేక అధికారి సుధా ప్రవీణ్, కోడూరు పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరావులతో కోడూరు గ్రామ అభివృద్ధి అంశాలు చర్చించారు. ప్రధానంగా అధికారులు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, వేసవిలో త్రాగునీటి సరఫరాపై శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామ జనాభా దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల నిర్వహణ, స్ట్రీట్ లైట్లను, పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

కార్యాలయంలో చేపట్టిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తక్షణమే పనులు పూర్తి చేసి కార్యాలయ ఆవరణలో పూల మొక్కలు నాటి సుందరీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సాయిబాబా ఆలయ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులను కమిటీ ప్రతినిధులు తోట శ్రీనివాసరావు, జూపూడి సుభా చంద్రబోస్ ఎమ్మెల్యేకు వివరించారు. స్మశానానికి ప్రహరీ మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. స్మశాన కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
