NEET Re-Exam | సీబీటీ విధానానికి నో..

NEET Re-Exam | సీబీటీ విధానానికి నో..

ఓఎంఆర్‌ విధానానికే గ్రీన్‌సిగ్నల్

NEET Re-Exam | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : జూన్ 21న నిర్వహించనున్న నీట్‌ పునఃపరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఓఎంఆర్‌ (OMR) విధానంలోనే పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది.

నీట్‌ పునఃపరీక్షను ఆన్‌లైన్‌ సీబీటీ విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, పరీక్షా విధానాన్ని చివరి నిమిషంలో మార్చడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. పరీక్షకు సమయం చాలా తక్కువగా ఉండటంతో పాటు, భారీ స్థాయిలో ఏర్పాట్లు అవసరమవుతాయని పేర్కొంది.

పరీక్షా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమయాభావం, పరిపాలనా అంశాలు, పరీక్ష నిర్వహణలో తలెత్తే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఓఎంఆర్‌ విధానాన్నే కొనసాగించాలని ఆదేశించింది.

దీంతో జూన్‌ 21న జరగనున్న నీట్‌ పునఃపరీక్ష గతంలో ప్రకటించిన విధంగానే పెన్‌-పేపర్‌ (OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు స్పష్టమైంది. విద్యార్థులు పరీక్షా విధానంపై ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు.